పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తన హవా చూపించింది. 30,391 సీట్లు గెలుపొందిన టీఎంసీ.. మరో 1,767 స్థానాల్లో ఆధిక్యం సాధించింది. 8,239 స్థానాల్లో విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ.. మరో 447 స్థానాల్లో ముందంజలో ఉంది. 2,158 పంచాయతీ స్థానాలు గెలుపొందిన కాంగ్రెస్.. మరో 151 సీట్లలో ఆధిక్యంలో ఉన్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఇక సీపీఐ(ఎం) పార్టీ 2,534 స్థానాల్లో విజయం సాధించింది.
పంచాయతీ సమితి, జిల్లా పరిషత్ ఎన్నికల్లోనూ టీఎంసీ దూసుకెళ్తోంది. మంగళవారం రాత్రి 11.30 గంటల సమయానికి లెక్కించిన ఓట్ల ఆధారంగా ఈ ఫలితాలు ప్రకటించారు అధికారులు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి మరో రెండు రోజులు పట్టే అవకాశముందని రాష్ట్ర ఎన్నికల అధికారులు తెలిపారు.
- పంచాయతీ సమితి ఎన్నికల ఫలితాలు ఇలా..
- టీఎంసీ– 2,612 సీట్లలో విజయం (627 సీట్లలో ఆధిక్యం)
- బీజేపీ- 275 (149)
- సీపీఎం- 63 (53)
- కాంగ్రెస్- 50 (26)
మంగళవారం ఉదయం 8 గంటలకు ఓట్లలెక్కింపు ప్రారంభమైంది. ఓట్ల కౌంటింగ్ ప్రక్రియలోనూ పలు చోట్ల ఉద్రిక్తతలు నెలకొన్నాయి. డైమండ్ హార్బర్‌లోని ఓ కౌంటింగ్ కేంద్రంపై దుండగులు బాంబులు విసిరారు. హావ్‌డాలోని కౌంటింగ్ కేంద్రాన్ని స్థానికులు ముట్టడించగా.. పోలీసులు లాఠీఛార్జ్ చేసి చెదరగొట్టారు.