కేంద్ర సర్కార్ ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ యోజన పథకం కింద ప్రయోజనం పొందుతున్న కొంతమంది రైతులకు వ్యవసాయ అధికారులు షాక్ ఇచ్చారు. 81వేల మంది రైతులను అనర్హులుగా ప్రకటించారు. బిహార్‌కు చెందిన 81వేల రైతులు 81.6 కోట్ల రూపాయల లబ్ధి పొందారని గుర్తించారు. తిరిగి వారి నుంచి ఆ సొమ్మును వసూలు చేయనున్నట్లు తెలిపారు.
రైతుల నుంచి సొమ్ము రికవరీ చేయాలని బ్యాంకులను ఆదేశించినట్లు బిహార్ వ్యవసాయ శాఖ డెరక్టర్ అలోక్ రంజన్ ఘోష్ పేర్కొన్నారు. ఆదాయ పన్ను చెల్లింపుదారులు, పథకానికి అనర్హులైన ఇతర వ్యక్తులను తమ పరిశీలనలో గుర్తించినట్లు తెలిపారు. మొత్తం 81,595 రైతుల్లో 45,879 మంది ఆదాయ పన్ను చెల్లింపుదారులు ఉన్నారని.. మరో 35,716 మందిని ఇతర కారణాల వల్ల అనర్హులుగా గుర్తించినట్లు వెల్లడించారు.
‘ఇటీవలే జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఈ వ్యవహారాన్ని ప్రస్తావనకు తెచ్చాం. ఈ విషయంపై ఇప్పటికే రైతులకు సమాచారం అందించాం. కొందరి రైతుల బ్యాంక్ ఖాతాలను స్తంభింపచేశాం. సంబంధిత బ్యాంక్ ఖాతాల నుంచి ఇప్పటికే రూ.10.3 కోట్లు వసూలు చేశాం.’ అని బిహార్ వ్యవసాయ శాఖ డెరక్టర్ అలోక్ రంజన్ ఘోష్ తెలిపారు.