ఎన్డీఏతో కలిసి కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇవాళ తమ బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. ఈ బల పరీక్షలో నెగ్గితే నీతీశ్ – ఎన్‌డీఏ సర్కార్ ఏర్పడే అవకాశం ఉంది. ఎన్డీఏతో కలిసి ప్రభుత్వాన్ని కొనసాగించాలని పట్టుదలతో ఉన్న సీఎం నితీశ్ కుమార్ అత్యధిక మంది ఎమ్మెల్యేలు బలం కలిగి బల పరీక్షలో గెలుస్తామనే ధీమాతో ఉన్నారు.
మరోవైపు బల పరీక్షలో నీతీశ్ ను ఎలాగైన ఓడించాలని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే తమ తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి ఎన్డీయేతో పాటు మహా కూటమి పార్టీలు తంటాలు పడుతున్నాయి. అందులో భాగంగా తాజాగా జేడీయూ ఎమ్మెల్యేలను పట్నాలోని చాణక్య హోటల్‌కు తరలించారు. అంతకుముందు ఆదివారం సాయంత్రం జరిగిన మీటింగ్‌కు పలువురు జేడీయూ ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. దీంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
బిహార్ అసెంబ్లీలో 243 మంది సభ్యులు ఉండగా 128 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న ఎన్‌డీఏ సర్కారు విజయం తమదే అని విశ్వాసంతో ఉంది. నితీశ్ కుమార్ సొంత పార్టీ ఎమ్మెల్యేలు అందరూ ఈ బల పరీక్షకు తప్పని సరిగా రావాలని విప్‌ను జారీ చేశారు.