బిహార్లోని నీతీశ్ కుమార్ ప్రభుత్వం సోమవారం రోజున బలపరీక్ష ఎదుర్కోనుంది. ఈ క్రమంలో బిహార్‌లో రాజకీయం రసవత్తరంగా మారింది. గతవారం రోజులుగా హైదరాబాద్‌లో ఉన్న 19 మంది బిహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బలపరీక్షలో పాల్గొనేందుకు పట్నా వెళ్లారు. నెల రోజుల క్రితం మహా ఘట్‌బంధన్‌ను వీడి నీతీశ్ కుమార్ ఎన్డీఏలోకి తిరిగి చేరడంతో బిహార్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే.
బిహార్ అసెంబ్లీలో 243 మంది సభ్యులు ఉండగా 128 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న ఎన్‌డీఏ సర్కారు బల పరీక్షలో విజయం తమదేనన్న విశ్వాసంతో ఉంది. విశ్వాస పరీక్షకు ముందు ఎమ్మెల్యేల ఓట్లు చీలే ప్రమాదం ఉందని భావించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను హైదరాబాద్ క్యాంపునకు తరలించింది. ఇప్పటికే ఆర్జేడీ ఎమ్మెల్యేలంతా ఆ పార్టీ నేత తేజస్వీ యాదవ్ బంగ్లాలో ఉన్నారు. ట్రాక్ సూట్ ధరించిన తేజస్వీ యాదవ్ పక్కనే ఉన్న యువ ఎమ్మెల్యే గిటార్ వాయిస్తూ నేతలందరిని ఉత్సాహ పరుస్తున్న దృశ్యాలను ఆ పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేసింది.