ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, బిజు జనతాదళ్ అధినేత అధినేత నవీన్ పట్నాయక్ రూటు మార్చారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు రాజ్యసభలో కీలక బిల్లుల ఆమోదానికి ఎన్డీయేకు సంఖ్యా బలం అవసరమైనప్పుడు బీజేడీ ఎంపీలు మద్దతిచ్చే వారు. ఆ కూటమిలో భాగస్వాములు కాకపోయినప్పటికీ మద్దతుగా నిలిచేవారు. తాజాగా ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న నవీన్.. తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.
ఈ క్రమంలో రూట్ మార్చిన బీజేడీ రాజ్యసభలో ప్రజల పక్షాన పోరాడాలని నిర్ణయించింది. పార్టీ ఎంపీలతో భేటీ అయిన నవీన్ పట్నాయక్ ఒడిశా ప్రజల అభివృద్ధి, సంక్షేమంపై సభా వేదికగా గొంతు వినిపించాలని, న్యాయపరమైన డిమాండ్ల పరిష్కారానికి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సభ్యులకు సూచించారు. సార్వత్రిక ఎన్నికల ముందు వరకు మిత్రపక్షాలుగానే వ్యవహరించిన ఈ రెండు పార్టీలు .. పొత్తు విఫలమవ్వడంతో ప్రత్యర్థి పార్టీలుగా మారాయి. ఈ నేపథ్యంలోనే ఇకపై ఒడిశాకు ప్రత్యేక హోదా, పేదలు విద్య, వైద్యం, ఇళ్ల నిర్మాణం తదితర సమస్యలపై పోరాడాలని నవీన్ యోచిస్తున్నారు.