వక్ఫ్ సవరణ చట్టం, బిల్లులపై రాష్ట్రపతికి గడువు విషయంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులపై బీజేపీ నేతలు ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా సుప్రీంకోర్టు చట్టాలు చేస్తే పార్లమెంటు మూతబడాల్సి వస్తుందంటూ బీజేపీ నేత, లోక్‌సభ సభ్యుడు నిశికాంత్ దుబె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. అయితే తాజాగా ఈ పరిమాణలపై బీజేపీ స్పందించింది. అలాంటి వ్యాఖ్యలు చేయవద్దని పార్టీ నాయకులను ఆదేశించింది.
న్యాయవ్యవస్థ, ప్రధాన న్యాయమూర్తిపై ఎంపీలు నిశికాంత్ దుబే, దినేశ్ శర్మ చేసిన వ్యాఖ్యలతో బీజేపీకి ఎటువంటి సంబధం లేదని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పష్టం చేశారు. ఇవి వారి వ్యక్తిగత వ్యాఖ్యలు అని.. జేపీపీ వాటితో ఏకీభవించదని తెలిపారు. అలాంటి వ్యాఖ్యలకు ఎప్పుడూ మద్దతు ఇవ్వదని.. పార్టీ వాటిని పూర్తిగా తిరిస్కరిస్తుందని వెల్లడించారు. ప్రజాస్వామ్యంలో విడదీయరాని భాగమైన న్యాయవ్యవస్థ పట్ల అధికార పార్టీకి గౌరవం ఉందన్న జేపీ నడ్డా.. రాజ్యాంగ రక్షణకు బలమైన స్తంభం బీజేపీ అని వ్యాఖ్యానించారు.