దేశంలో వరుస బాంబు బెదిరింపు కాల్స్ కలకలం రేపుతున్నాయి. బాంబ్ బెదిరింపు కాల్స్ వస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సోమవారం రాత్రి సమయంలో ముంబయిలోని తాజ్ హోటల్లో బాంబు ఉన్నట్లు బెదిరింపు కాల్స్ వచ్చాయి. అంతే కాకుండా ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలోనూ బాంబు ఉన్నట్లు కాల్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రెండు చోట్లకు వెంటనే చేరుకుని బాంబు కోసం గాలించారు.
ఇది జరుగుతుండగానే తాజాగా దిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది, ప్రయాణికులను అత్యవసర ద్వారం ద్వారా దించేశారు. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇలా వరుస బాంబు బెదిరింపు కాల్స్ గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ప్రధాన నగరాల్లో ఈ కాల్స్ రావడంతో అధికారులంతా అప్రమత్తమై ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నారు.