స్వర్గీయ నందమూరి తారకరామా రావు 101 జయంతి సందర్భంగా ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. కొంతమంది రాజకీయ నేతలు ఎన్టీఆర్తో తమకున్న బంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. తెలుగువారి గుండెచప్పుడు.. ఎన్టీఆర్ అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక ఆయన అని కొనియాడారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన వెంకయ్యనాయుడు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
పురాణ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి ప్రజలను మెప్పించారని వెంకయ్యనాయుడు ప్రశంసించారు. రాజకీయాల్లోనూ నవశకానికి ఎన్టీఆర్ నాంది పలికారని తెలిపారు. ఆయన .. దేశ రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేశారని.. నిరంకుశ రాజకీయాలకు ఎన్టీఆర్ ఎదురొడ్డి నిలిచారని పేర్కొన్నారు. గొప్ప సంస్కరణవాది.. నందమూరి తారక రామారావు అని వెంకయ్యనాయుడు కొనియాడారు.
మరోవైపు ఎన్టీఆర్ ఘాట్ వద్ద తన తండ్రికి బాలకృష్ణ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ అంటే నటనకు నిర్వచనం అని.. నవరసాలకు అలంకారం అని.. నటనకు విశ్వవిద్యాలయం అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తిని ఎంతోమంది అందిపుచ్చుకున్నారని తెలిపిన బాలయ్య .. తెలుగువారి ఆరాధ్యదైవం ఎన్టీఆర్ అని అన్నారు.
https://x.com/MVenkaiahNaidu/status/1795270502501539999