ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న ప్రముఖ ఎడ్‌టెక్ కంపెనీ బైజూస్ భారతీయ విభాగం సీఈఓ అర్జున్ మోహన్ ఈరోజు రాజీనామా చేశారు. ఆ సంస్థ రోజువారీ కార్యకలాపాలను వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్ పర్యవేక్షించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. కానీ, సంస్థకు సలహాదారుడిగా మాత్రం ఆయన కొనసాగనున్నట్లు సమాచారం.
రవీంద్రన్ క్యాట్ కోచింగ్ ఇస్తున్న తొలినాళ్లలో అర్జున్ ఆయనకు స్టూడెంట్, అలా రవీంద్రన్‌కు అత్యంత నమ్మకస్థుడిగా అర్జున్ మోహన్‌కు సంస్థలో పేరుంది. ఆయన సీఈఓ బాధ్యతలు చేపట్టి ఆరు నెలలే అవుతోంది. సంస్థ పునర్‌వ్యవస్థీకరణ కీలక దశలో ఉన్న తరుణంలో రాజీనామా చేయడం చర్చనీయాంశమవుతోంది. అర్జున్ బాధ్యతలు చేపట్టిన తర్వాతే బైజూస్‌లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించి మిగిలిన వారిని ఇంటి నుంచి పని చేసేందుకు ఆయన అనుమతించారు. అర్జున్ నిష్క్రమణతో బైజూ ఇండియా కార్యకలాపాలను రవీంద్రన్ యాప్ అండ్ ఏఐ, టెస్ట్ ప్రిపరేషన్, ట్యూషన్ సెంటర్లు.. ఇలా మూడు విభాగాలుగా వర్గీకరించనున్నట్లు కంపెనీ తెలిపింది.