ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య విషయంలో భారత్‌పై ఆరోపణలు చేసి ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు తెరలేపిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తన బుద్ధి ఏమాత్రం మార్చుకోలేదు. తాజాగా మరోసారి ఆయన కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ‘చట్టాలను సమర్థించడం, గౌరవించడం’పై ట్రూడో తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ పోస్టు ఇరు దేశాల మధ్య మరింత దూరం పెంచుతోంది. మరోవైపు యూఏఈ అధ్యక్షుడితో ట్రూడో భారత్-కెనడా దౌత్య వివాదం గురించి చర్చించి మరింత రెచ్చగొట్టారు ట్రూడో.
యూఏఈ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయెద్‌తో ఫోన్లో మాట్లాడానని.. భారత్ అంశం, చట్టాలను సమర్థించడం, పరస్పరం గౌరవించుకోవడం వంటి అంశాల ప్రాముఖ్యతను గురించి కూడా చర్చించినట్లు ట్రూడో తన పోస్టులో రాసుకొచ్చారు. ఇజ్రాయెల్‌లో ప్రస్తుత పరిస్థితి గురించి పరస్పరం ఆందోళన వ్యక్తం చేశామని తెలిపారు. పౌరుల ప్రాణాలను రక్షించాల్సిన ఆవశ్యకత గురించి చర్చించామని చెప్పుకొచ్చారు.
నిజ్జర్ హత్యపై ట్రూడో చేసిన వ్యాఖ్యలతో భారత్-కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. ఈ ట్వీట్ ఇరు దేశాల మధ్య వివాదాన్ని మరింత పెంచేలా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.