మణిపుర్ విద్యార్థుల హత్య కేసు.. నలుగురిని అరెస్టు చేసిన సీబీఐ

-

జాతుల మధ్య వైరంతో రణరంగంలా మారిన మణిపుర్​లో ఇద్దరు విద్యార్థుల హత్య మరింత కలకలం రేపింది. అల్లర్లు చల్లారుతున్నాయనుకున్న తరుణంలో ఈ హత్య ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మళ్లీ ఆ రాష్ట్రంలో అగ్గి రాజుకుంది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన కేంద్ర సర్కార్ విద్యార్థుల హత్యపై దర్యాప్తు చేయాలని సీబీఐను పంపింది. అలా రంగంలోకి దిగిన సీబీఐ ఈ కేసులో నలుగురు నిందితులను ఆదివారం రోజున అరెస్టు చేసింది.

ఇంఫాల్‌కు 51 కిలోమీటర్ల దూరంలోని చురాచంద్‌పుర్‌ జిల్లాలో ఇద్దరు బాలికలు సహా నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. భద్రతా కారణాల రీత్యా అరెస్టైన నలుగురిని వెంటనే అసోంలోని గువాహటికి తరలించామని సీబీఐ అధికారులు తెలిపారు. నిందితుల్లో ఒకరిని వారి పిల్లలతో సహా అరెస్టు చేసినట్లు వెల్లడించారు. మణిపుర్‌ పోలీసులు, ఆర్మీ బలగాలతో కలిసి ఈ ఆపరేషన్‌ చేసినట్లు చెప్పారు.

మరోవైపు నిందితులను అరెస్టు చేసినట్లు మణిపుర్‌ సీఎం బీరేన్‌ సింగ్‌ సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విటర్‌) ద్వారా వెల్లడించారు. నేరం చేసినవారెవరూ చట్టం నుంచి తప్పించుకోలేరని.. క్రూరమైన నేరాలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు తప్పవని ఆయన హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news