బిహార్ స్టేట్ ఐకాన్‌గా ఫోక్ సింగర్ మైథిలీ ఠాకూర్ నియమితులయ్యారు. కేంద్ర ఎన్నికల సంఘం మైథిలీని బిహార్ రాష్ట్ర ఐకాన్‌గా నియమిస్తూ ఆ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఉత్తరం పంపించింది. ఎన్నికల ప్రక్రియ గురించి 22 ఏళ్ల మైథిలీ ఓటర్లలో అవగాహన కల్పించనుంది. బిహార్ స్టేట్ ఐకాన్‌గా మైథిలీ ఠాకూర్ నియామకానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపిందని ఆ రాష్ట్ర ఎన్నికల అధికారి ఒకరు సోమవారం వెల్లడించారు. ‘స్టేట్ ఐకాన్‌గా నియామకం కావడం నాకు చాలా సంతోషంగా ఉంది’ అని మైథిలీ తెలిపింది.
తన కూతురు రాష్ట్ర ఐకాన్‌గా ఎంపికవడం పట్ల మైథిలీ తండ్రి ఆనందం వ్యక్తం చేశాడు. ఎన్నికల సంఘం, బిహార్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. స్టేట్ ఐకాన్‌గా నియమించడం వల్ల మైథిలీ బిహార్ రాష్ట్ర వ్యాప్తంగా జానపద సంగీతాన్ని విస్తరింపచేస్తుంది. తద్వారా ఓటర్లను చైతన్యం చేస్తుంది’ అని మైథిలీ తండ్రి రమేశ్ ఠాకూర్ తెలిపాడు. 2025 అక్టోబర్ లేదా నవంబర్‌లో బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మైథిలీని స్టేట్ ఐకాన్‌గా నియమించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.