ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని పొడిగించిన కేంద్రం

-

కేంద్ర ప్రభుత్వం ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని పొడిగించింది. దేశీయ మార్కెట్‌లో పెరుగుతున్న ఉల్లి ధరల్ని అదుపు చేయడానికి, తగిన నిల్వల్ని అందుబాటులో ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. గతంలో విధించిన ఆంక్షల గడువు మార్చి 31వ తేదీతో ముగియనుండటంతో వీటి ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని పొడిగించినట్లు తాజాగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ నోటిఫికేషన్‌లో తెలిపింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఈ నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది.

ఉల్లి ధరల్ని నియంత్రించడానికి కేంద్రం గతంలో అనేక చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. గతేడాదిలో అక్టోబర్ 28 నుంచి డిసెంబర్ 31 వరకు ఉల్లిపాయల ఎగుమతులపై టన్నుకు కనీస ఎగుమతి ధరను 800 డాలర్లుగా నిర్ణయించి, ఆగస్టులో వీటిపై 40 శాతం ఎగుమతి సుంకాన్ని విధించింది. తర్వాత డిసెంబరు 8వ తేదీన కేంద్రం ఎగుమతులపై నిషేధం విధించి, బఫర్‌ స్టాక్‌ను విడుదల చేసింది. ఆ సమయంలో నేషనల్ కో-ఆపరేటివ్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్ ద్వారా యూఏఈ, బంగ్లాదేశ్‌లకు 64,400 టన్నుల ఉల్లిని ఎగుమతి చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version