ప్రస్తుతం ఎక్కడ చూసినా గేమింగ్, ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యవహారంపై చర్చ నడుస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పోలీసులు ఆన్ లైన్ బెట్టింగ్ మాఫియాకు చుక్కలు చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై కేంద్ర సర్కార్ స్పందించింది. ఆన్ లైన్ గేమింగ్, బెట్టింగ్ పై రాష్ట్రాలు చట్టాలు చేయొచ్చని అవి రాష్ట్ర పరిధిలోని అంశాలని వెల్లడించింది. వీటికట్టడి కేంద్రం కూడా చర్యలు తీసుకుంటోందని లోక్ సభలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ తెలిపారు.
డీఎంకే ఎంపీ దయానిధి మారన్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ఈ అంశంపై చట్టాలు రూపొందించేందుకు రాష్ట్రాలకు రాజ్యాంగం నైతిక, చట్టబద్ధ అధికారాన్ని ఇచ్చిందని కేంద్రమంత్రి గుర్తుచేశారు. దయచేసి సమాఖ్య నిర్మాణాన్ని అర్ధం చేసుకోండంటూ సూచించారు. రాష్ట్రాల పరిధిలోని అంశమే అయినా.. తమకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా 1410 గేమింగ్ సైట్లను ఇప్పటికే నిషేధించామని తెలిపారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆన్‌లైన్ మనీ గేమింగ్ సంస్థలపై కొరడా ఝళిపిస్తూ.. అక్రమంగా నిర్వహిస్తోన్న వందల వెబ్‌సైట్లను ఆర్థిక శాఖ పరిధిలోని డీజీజీఐ బ్లాక్ చేసిన విషయం తెలిసిందే.