కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని రూ.10లక్షలకు పెంచే యోచనలో ఉన్నట్లు తెలిపింది. రాబోయే మూడేళ్లలో ఈ పథకం కింద లబ్ధిపొందేవారి సంఖ్యను సైతం రెండితలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. తొలుత 70 ఏళ్లు పైబడిన వారిని ఈ పథకంలో భాగం చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ అధికారులు తెలిపారు. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపితే ఏటా ఖజానాపై మరో రూ.12,076 కోట్ల భారం పడనుందని వెల్లడించారు. దేశంలో మూడింట రెండొంతుల మందికి ఆరోగ్య బీమా వర్తించనుందని అంచనా వేశారు.
ఈ ప్రతిపాదనలన్నీ లేదా వీటిలో కొన్నింటిని రాబోయే కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఆయుష్మాన్ భారత్ యోజనను 70 ఏళ్లు పైబడిన వారికి సైతం విస్తరిస్తున్నట్లు జూన్ 27వ తేదీన జరిగిన పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో మరో 4-5 కోట్ల మందికి ఈ పథకం ద్వారా లబ్ధిచేకూరే అవకాశం ఉంది.