తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కోలపై చైనా హ్యాకర్ల సైబర్‌ దాడి.. సమర్థవంతంగా తిప్పికొట్టిన అధికారులు..

-

ముంబైలో గతేడాది అక్టోబర్‌లో ఏర్పడిన విద్యుత్‌ అంతరాయ సమస్య వెనుక చైనాకు చెందిన హ్యాకర్ల హస్తం ఉండి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్న విషయం విదితమే. అయితే తాజాగా చైనా హ్యాకర్లు తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కోలపై సైబర్‌ దాడికి యత్నించారు. ఈ మేరకు కేంద్ర విద్యుత్‌ అథారిటీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. అలాగే కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ ఆఫ్‌ ఇండియా (సర్ట్‌-ఇన్‌) కూడా ఈ సైబర్‌ దాడి వెనుక చైనా హ్యాకర్ల ప్రమేయం ఉండి ఉండవచ్చని అభిప్రాయపడింది.

chinese hackers cyber attack thwarted by ts transco and genco

తెలంగాణ స్టేట్‌ లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ (టీఎస్‌ఎల్‌డీసీ) సర్వర్లను లక్ష్యంగా చేసుకుని చైనా హ్యాకర్లు సైబర్‌ దాడులు చేపట్టారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు అప్రమత్తం కావడంతో ఆ దాడిని సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. చైనాలోని కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సర్వర్లు టీఎస్‌ఎల్‌డీసీ, టీఎస్‌ ట్రాన్స్‌కో, టీఎస్‌ జెన్‌కోలకు చెందిన సర్వర్లతో కమ్యూనికేట్‌ అయ్యేందుకు యత్నిస్తున్నాయన్న సమాచారం మేరకు సంబంధిత అధికారులు అప్రమత్తమై సైబర్‌ దాడి జరగకుండా నిలువరించారు. చైనా హ్యాకర్లను సమర్థవంతంగా అడ్డుకున్నారు.

ఈ సందర్భంగా ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌ రావు మీడియాతో మాట్లాడుతూ 40 సబ్‌స్టేషన్లకు చెందిన సర్వర్ల నుంచి మాల్‌వేర్‌ను తొలగించామని తెలిపారు. ఫైర్‌వాల్‌ను కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు. కాగా 2019లో టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌కు చెందిన వెబ్‌సైట్‌పై సైబర్‌ దాడి జరగ్గా విద్యుత్‌ సేవలకు మూడు, నాలుగు రోజుల పాటు అంతరాయం ఏర్పడింది. అయితే అక్టోబర్‌ 12, 2020న ముంబైలోనూ చాలా సేపు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీని వెనుక చైనా హ్యాకర్ల హస్తం ఉందేమోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ దీనిపై కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌ స్పందిస్తూ.. ముంబైలో మానవ తప్పిదం వల్లే విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడిందన్నారు. కాగా చైనా ప్రభుత్వంతో సంబంధం ఉన్న కొందరు హ్యాకర్లు భారత్‌లోని పవర్‌ గ్రిడ్‌ సిస్టమ్‌లలోకి మాల్‌వేర్‌ను చొప్పించడం ద్వారా సైబర్‌ దాడులకు పాల్పడేందుకు అవకాశం ఉందని మరోవైపు అమెరికాకు చెందిన రికార్డెడ్‌ ఫ్యూచర్‌ అనే కంపెనీ సైతం వివరాలను వెల్లడించింది.

ఇదే విషయంపై మహారాష్ట్ర హోం శాఖ మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ మాట్లాడుతూ పవర్‌ గ్రిడ్‌ సిస్టమ్‌లపై సైబర్‌ దాడులు జరగడం అనేది కేవలం ముంబైకి మాత్రమే పరిమితం కాదని, దేశంలో ఎక్కడైనా ఇలా జరగవచ్చని అన్నారు. ఈ విషయంపై కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌తో తాను మాట్లాడానని, ముంబైలో జరిగిన సంఘటనపై మరిన్ని వివరాల కోసం ఆయన అడిగారని, అయితే ఇలాంటి దాడులు జరిగే అవకాశం ఉన్నందున ఇకపై అందరం అలర్ట్‌గా ఉండాల్సిందేనని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news