ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన గోదావరి-బనకచర్ల ప్రాజెక్ట్ సమాచారం, వివరాలు దాచి పెడుతోందని తెలంగాణ నీటి పారుదల అధికారులు ఆరోపించారు. గోదావరి-బనకచర్ల అనుసంధానం ప్రాజెక్ట్ పై తెలంగాణ రాష్ట్రం వ్యక్తం చేసిన అభ్యంతరాలపై గోదావరి నదీ యాజమాన్య బోర్డులో కీలక సమావేశం జరిగింది. సోమవారం జీఆర్ఎంబీ చైర్మన్ ఏ.కే.ప్రధాన్ అధ్యక్షతన హైదరాబాద్ లోని జలసౌధలో బోర్డు 17వ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో తెలంగాణ నీటి పారుదల ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఇంజినీర్ ఇన్ చీఫ్ అనీల్, ఏపీ జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. జీఆర్ఎంబీకి కేంద్రం నుంచి లేఖ వచ్చి 5 నెలలు అవుతుందని.. సమాచారం ఇవ్వలేదని తెలంగాణ అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. అనుమతులు లేకుండా ప్రాజెక్టు చేపడుతున్నారని మరోసారి తెలంగాణ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పూర్తి వివరాలు, దీనివ్లల తెలంగాణ పై ప్రభావం లాంటి తదితర అంశాల వివరాలు ఏపీ సర్కార్ అందించాలని అధికారులు బోర్డును కోరారు.