కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర ఇవాళ ప్రారంభం కానుంది. ఈ యాత్ర ప్రారంభానికి ముందే పార్టీకి గట్టి షాక్ తగిలింది. మహారాష్ట్రలో ఆ పార్టీ సీనియర్ నేత మిలింద్ దేవ్‌రా రాజీనామా చేశారు. తన రాజకీయ ప్రయాణంలో కీలక అధ్యాయం తుది ఘట్టానికి చేరిందని తాను కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఆయన ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది.
ప్రధాని మోదీ నిర్ణయించిన సమయానికే మిలింద్ రాజీనామా చేశారని పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ ఆరోపించారు. మిలింద్ తండ్రి మురళీ దేవ్‌రా ఎప్పుడూ కాంగ్రెస్ పక్షపాతిగానే ఉన్నారని పేర్కొన్నారు. దక్షిణ ముంబయి లోక్‌సభ స్థానం ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి కేటాయిస్తారనే వార్తల నేపథ్యంలో రాహుల్ గాంధీతో మాట్లాడాలని మిలింద్ శుక్రవారం తనను కోరారని తెలిపారు. పార్టీ మారాలనుకుంటున్నారా..? అన్న ప్రశ్నకు ఇప్పుడు దాని గురించి మాట్లాడలేనని చెప్పారని వెల్లడించారు. తర్వాత ఆయన పార్టీ నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారని.. కానీ, ఆయన రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన సమయం మాత్రం కచ్చితంగా ప్రధాని మోదీ నిర్ణయించిందేనని జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు.