భారత్‌లో కొవిడ్ విజృంభన కొనసాగుతూనే ఉంది. కరోనా కేసుల సంఖ్య దేశంలో అరవై లక్షలకు చేరువు కాగా.. మరణాల సంఖ్య లక్షకు దగ్గరవడం ఆందోళన కలిగిస్తుంది. దేశంలో నిత్యం 85 నుంచి లక్షలోపు కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 88,951 కరోనా కేసులు నమోదయ్యాయి. మరోపక్క నిత్యం కరోనా కారణంగా వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారు.
కొత్తగా నమోదైన కేసులతో భారత్‌లో మొత్తం కేసుల సంఖ్య 59,90,513కు చేరుకుంది. కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 94,533కు చేరుకుంది. దేశంలో ప్రస్తుతం 9,57,414 యాక్టివ్ కేసులున్నాయి. ఆదివారం మధ్యాహ్నానికి భారత్‌లో కరోనా కేసుల సంఖ్య అరవై లక్షలు దాటనుంది. గడిచిన వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా నమోదైన ప్రతి మూడు కేసుల్లో ఒకటి భారత్ నుంచే నమోదైంది. అదే విధంగా ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా మరణించిన ప్రతి ఐదుగురిలో ఒకరు భారతదేశానికి చెందిన వారే కావడం గమనార్హం.