అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘బిపోర్‌జాయ్’ తుపాను అతి తీవ్ర తుపానుగా మారింది. తీరం దిశగా ఈ తుపాను కదులుతుండటంతో బలమైన గాలులు వీస్తున్నాయి. ముంబయిపై ఈ తుపాను ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో ముంబయి ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. గాలుల తీవ్రతతో కొన్ని విమానాలను రద్దు చేయగా.. చాలా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. కొన్ని విమానాలకు ల్యాండ్ చేసే పరిస్థితి లేక మరో ఎయిర్‌పోర్టుకు దారిమళ్లిస్తున్నారు. బిపోర్‌జాయ్ తుపానుతో ముంబయి వాసులు ఇబ్బందులు పడుతున్నారు.
‘‘వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ముంబయి ఎయిర్‌పోర్టులోని 09/27 రన్‌వేను తాత్కాలికంగా మూసివేశారు. దీంతో కొన్ని విమానాలు ఆలస్యం/రద్దయ్యాయి. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. ఆలస్యాన్ని తగ్గించేందుకు సాధ్యమైన అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం’’ అని ఎయిరిండియా తెలిపింది. అటు ఇండిగో కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. తప్పనిసరి పరిస్థితుల్లోనే విమానాలు ఆలస్యమవుతున్నట్లు పేర్కొంది.