హెల్మెట్ ధరించకుండా చాలా మంది వాహనదారులు బైక్ నడుపుతుంటారు. తీరా ట్రాఫిక్ పోలీసులకు చిక్కితే చాలు ఎందుకు హెల్మెట్ పెట్టుకోలేదో వేయి కారణాలు చెబుతారు. ఎగ్జామ్కు ఆలస్యమవుతోందని, ఇంట్లో గొడవలో పడి మరిచిపోయామని, హెయిర్ కట్కు వెళ్తున్నామని ఇలా వివిధ రకాల సాకులు చెబుతుంటారు. ఇలా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారి గురించి దిల్లీ పోలీసులు సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్టు తెగ వైరల్ అవుతోంది.
హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేదు అని ట్రాఫిక్ పోలీసులు ప్రశ్నిస్తే.. ‘‘ఇక్కడివరకే వెళ్తున్నా.. అందుకే హెల్మెట్ పెట్టుకోలేదు’’ అని వాహనదారులు చెప్పే కథకు ‘బెస్ట్ స్టోరీ’ విభాగంలో ఆస్కార్ ఇవ్వొచ్చంటూ దిల్లీ పోలీసులు చమత్కరించారు. ‘‘హెల్మెట్ పెట్టుకోనందుకు మీరేం కథలు అల్లారు? కామెంట్లలో చెప్పండి’’ అంటూ నెటిజన్లను ఉద్దేశించి క్యాప్షన్ ఇచ్చారు.
ఇక ఈ పోస్టు కింద కామెంట్లలో నెటిజన్లు రెచ్చిపోయారు. ‘‘ఎమర్జెన్సీ ఆస్పత్రికి వెళ్తున్నాను’’ , హెల్మెట్ కొనేందుకే బయల్దేరానంటూ మరొకరు, ‘‘నేను ఎవరి కొడుకునో తెలుసా?’’ అంటూ ఇలా నెటిజన్లు రకరకాల కామెంట్లు పెట్టారు.
Story mat banao, helmet lagao!#Oscar#Oscars pic.twitter.com/yyYz4Mcmaf
— Delhi Police (@DelhiPolice) March 12, 2024