దిల్లీలో రోజురోజుకు వాయు నాణ్యత క్షీణిస్తోంది. దీపావళి ముందు రోజు వర్షం కురవడంతో కాస్త ఊరటనిచ్చిన వాయు కాలుష్యం.. దీపావళి రోజున టపాసులు పేల్చడంతో మరింతగా క్షీణించింది. ఇక అప్పటి నుంచి నాణ్యత రోజురోజుకు తగ్గుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. వాయు కాలుష్య నియంత్రణకు పక్కా ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయడంపై దృష్టి సారించింది.
ఈ నేపథ్యంలోనే కేంద్రం రూపొందించిన ఈ ప్రణాళికపై ఇవాళ దిల్లీ సెక్రటేరియట్‌లో పర్యావరణ శాఖ మంత్రి వివిధ శాఖల అధికారులతో భేటీ కానున్నారు.. కాలుష్య నియంత్రణ ప్రణాళికను అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు సంబంధిత అధికారులను గతంలో మందలించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా దిల్లీలో కాలుష్య నిరోధక చర్యలను అమలు చేసే బృందాలను పర్యవేక్షించడానికి ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర అధికారులకు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి సూచించారు . దిల్లీ ప్రభుత్వం, ఐఐటీ-కాన్పూర్ ఇటీవల సంయుక్తంగా జరిపిన పరిశోధనల్లో 38 శాతం కాలుష్యం…. వాహన ఉద్గారాల ద్వారానే వ్యాపిస్తోందని తేలిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ దిశగా చర్యలు చేపట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.