పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గంటగంటకు తీవ్రంగా మారుతోందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అది తీవ్ర వాయుగుండంగా మారి వాయవ్య దిశగా కదులుతోందని చెప్పారు. విశాఖపట్నం, పరదీప్ (ఒడిశా)కు ఆగ్నేయంగా 380 కి.మీ., దిఘా (పశ్చిమబెంగాల్)కు దక్షిణంగా 530 కి.మీ దూరంలో ఇది కేంద్రీకృతమైనట్లు వెల్లడించారు. ప్రస్తుతం గంటకు 18 కి.మీ. వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా తీవ్ర వాయుగుండం కదులుతున్నట్లు పేర్కొన్నారు.
ఈ వాయుగుండం ఈ నెల 18వ తేదీ ఉదయం నాటికి బంగ్లాదేశ్‌లోని ఖేపుపార – మొంగ్లా మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర, ఒడిశా తీరాల వెంబడి మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రెండు రోజుల పాటు ఏపీలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.