ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్, మనీ గేమింగ్ యాప్స్ వల్ల యువత పెడదారి పడుతున్నారు. సరదాగా మొదలుపెట్టిన ఆటలు తర్వాత వ్యసనంగా మారి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. అప్పులపాలై కొందరు రోడ్డున పడుతుంటే.. వాటిని చెల్లించలేక మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కన్నవారికి కడుపుకోత మిగులుస్తున్నారు. ఆన్‌లైన్ మనీ గేమింగ్ సంస్థల (online money gaming platforms) వల్ల ఎంతో మంది యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నాయి.
ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ మనీ గేమింగ్ సంస్థలపై తాజాగా కేంద్ర ప్రభుత్వం కొరడా ఝళిపించింది. అక్రమంగా నిర్వహిస్తోన్న 357 వెబ్‌సైట్లను బ్లాక్ చేసింది. ఆ గేమింగ్ సంస్థలకు చెందిన 2400 బ్యాంక్ ఖాతాలను కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని డీజీజీఐ సీజ్ చేసింది. వాటి నుంచి రూ.126 కోట్లను ఫ్రీజ్ చేసినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అలాగే మనీ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌ల పట్ల అప్రమత్తం ఉండాలని, వాటిని ఎవరూ వాడొద్దని డీజీజీఐ అధికారులు తాజాగా హెచ్చరికలు జారీ చేశారు.