బర్డ్‌ ఫ్లూ వైరస్‌కు కూడా మ్యుటేషన్‌ వచ్చిందా ?

-

కరోనా వ్యాప్తి తగ్గుతోందనుకునేలోపే మరో టెన్షన్‌ మొదలైంది. దేశంలో ఇప్పుడు బర్డ్‌ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. నాలుగు రాష్ట్రాల్లో ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో చికెన్, ఎగ్స్‌ తినాలంటేనే.. ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. ఇంతకీ ఏంటీ బర్డ్‌ ఫ్లూ.. దీని ప్రభావం మనుషులపై ఎలా ఉంటుంది ? బర్డ్‌ ఫ్లూ వైరస్‌కు కూడా మ్యుటేషన్‌ వచ్చిందా…

కరోనాకు వ్యాక్సిన్‌ వస్తోందని సంబరపడేలోపు మరో వైరస్‌ టెన్షన్‌ పుట్టిస్తోంది. బర్డ్‌ ఫ్లూ ఇప్పుడు కలవరం కలిగిస్తోంది. ఇప్పటికే రాజస్థాన్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, మధ్య ప్రదేశ్‌, కేరళ రాష్ట్రాల్లో ఫ్లూ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా హైఅలర్ట్‌ ప్రకటించింది కేంద్రం. మామూలుగా పక్షుల ప్రాణాలు తీసే ఈ వైరస్‌.. మనుషులకూ సోకే ప్రమాదం ఉంది. ఇంతకముందు ఈ వ్యాధి బారినపడి ప్రజలు చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. దీంతో అసలే కరోనా ధాటికి విలవిల్లాడుతున్న మానవాళికి మరో ఉపద్రవం ముంచుకొస్తోంది..

ఏవియన్‌ ఇన్‌ఫ్లూయంజాకు చెందిన టైప్‌-ఏ వైరస్‌ను బర్డ్‌ ఫ్లూగా పిలుస్తారు. ఇన్‌ఫ్లూయంజా టైప్‌-ఏలో డజనుకుపైగా వైరస్‌లు ఉండగా హెచ్5ఎన్8, హెచ్5ఎన్1 రకాలకు చెందిన బర్డ్‌ ఫ్లూ మాత్రం పౌల్ట్రీ ఉత్పత్తులైన కోళ్లు, బాతులతో పాటు టర్కీలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. ముఖ్యంగా కొన్ని కోళ్లు, పక్షుల్లో గుడ్లు తక్కువగా పెట్టడం వంటి స్వల్ప తీవ్రత చూపించగా, మరికొన్ని మాత్రం వాటి ప్రాణ నష్టానికి దారితీస్తాయి.

రాత్రిపూట కాకులు పెద్ద సంఖ్యలో నివాసముండేచోట, భూమి కింద దుంపల ద్వారా కూడా ఈ బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందే అవకాశాలున్నాయి. అందుకే ఆయా ప్రాంతాల్లో సున్నం జల్లి శుభ్రం చేసి తరువాత హైపోక్లోరైడ్ క్రిమి సంహారక మందులు జల్లాలని ఆరోగ్య, అటవీ, మునిసిపల్ కార్పొరేషన్, పశువైద్య విభాగానికి సూచనలు జారీ చేసింది. వ్యక్తిగత పరిశుభ్రత, క్రిమిసంహారక పద్దతులు, ఆహార శుద్ధి ప్రమాణాలు పాటించడం, పచ్చి గుడ్లను తినకుండా ఉండటం ద్వారా ఈ వైరస్‌లను సమర్థవంతంగా నియంత్రించవచ్చని సూచించింది. ముఖ్యంగా సక్రమంగా ఉడికించిన మాంసాన్నే తీసుకోవాలని సూచిస్తోంది. అధిక ఉష్ణోగ్రతల వద్ద ఈ వైరస్‌ బ్రతకలేదు.

జీవావరణ, పర్యావరణ సమస్యల వల్ల రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న పక్షుల్లో ఇది వృద్ధి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం కనిపిస్తున్న వైరస్.. మ్యుటేషన్‌ చెందుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇండియాలో పౌల్ట్రీలో కనిపించేది బర్డ్ ఫ్లూ హెచ్5ఎన్1 వైరస్. కానీ ఇప్పుడు కాకుల్లో గుర్తించినది మ్యుటేట్ అయిన హెచ్5ఎన్8 వైరస్. కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version