వివాదాస్పద వక్ఫ్ (సవరణ) బిల్లు ఎట్టకేలకు లోక్‌సభ ముందుకు వచ్చింది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా విపక్షాలు ఆందోళన చేపట్టినా.. వారి నిరసనల నడుమ బుధవారం మధ్యాహ్నం కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. అనంతరం చర్చ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వక్ఫ్ బోర్డులో మరింత పారదర్శకత తీసుకురావాలనేది తమ ఉద్దేశం అని తెలిపారు. యూపీఏ హయాంలో వక్ఫ్ బోర్డును వర్గాలుగా విభజించారని.. షియా, సున్నీ, ఇతర బోర్డుల్లో ఆ వర్గాల వారే ఉండేలా విభజించారని వెల్లడించారు.

‘వక్ఫ్ బోర్డు ఉన్నా భారత్‌లో ముస్లింలు పేదలుగానే ఉన్నారు. గతంలో వక్భ్ బోర్డు ఆదాయం చాలా తక్కువగా ఉండేది. పేద ముస్లింలను అభివృద్ధిలోకి తీసుకురావాలనేది ప్రభుత్వ లక్ష్యం. పార్లమెంటు భవనం సహా దిల్లీలోని పలు ఆస్తులు తమవేనని గతంలో వక్ఫ్ బోర్డు చెప్పింది. దిల్లీ వక్ఫ్ బోర్డు ఆస్తులకు సంబంధించి ఏళ్ల తరబడి కోర్టులో కేసు నడిచింది. 123 ఆస్తులను వక్ఫ్ బోర్డుకు యూపీఏ సర్కారు డీనోటిఫై చేసింది. ఎన్డీఏ సర్కారు రాకపోయి ఉంటే పార్లమెంటు భవనం కూడా డీనోటిఫై చేసేవారు.మోదీ సర్కారు రాకపోతే ఏఏ భవనాలను వక్ఫ్‌బోర్డుకు డీనోటిఫై చేసేవారో? వక్ఫ్ బిల్లుపై విపక్షాల సలహాలను పరిగణనలోకి తీసుకుంటాం.’ అని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు.