విడాకులకు రోడ్లు ఎలా కారణం అవుతాయి.వెరీ సిల్లీ పాయింట్.. కానీ ఆలోచిస్తే ఇదే సబబు అని అనిపించేంతలా ఓ విపక్ష పార్టీ మహిళా నేత మాట్లాడుతున్నారు. నేను ఒక మాజీ సీఎం భార్యను అన్న సంగతి వదిలేసి ఆలోచించండి.. ముంబై దారులు ఏ విధంగా ఉన్నాయో ఓ సారి పరిశీలించండి అంటూ విన్నవిస్తూ అసలు విడాకుల వరకూ జంటలు వెళ్తున్నాయంటే అందుకు కారణంగా ముంబై రోడ్లే! అని ఆవేదన చెందుతున్నారామె.
ఆమె బీజేపీ నాయకుడి భార్య .. దీనిపై వివాదం రగిలాక శివసేన కూడా స్పందించింది. శివసేన ముంబై లో రూలింగ్ పార్టీ.. ఈ వార్త ఎవ్వరూ చదవొద్దని చదివితే బెంగళూరు వాస్తవ్యులూ ఇబ్బందుల్లో పడతారని ప్రియాంక చతుర్వేది అనే శివసేన లీడర్ స్పందించారు. ఇంతకూ ఆ మాటలు చెప్పిన మహిళా నేత ఎవరో తెలుసా? ఆ వివరం ఈ కథనంలో..
అసలు రోడ్లెలా ఉండాలి.. హాయిగా ప్రయాణించేందుకు వీలుగా ఉండాలి. కానీ రోడ్లు ఎలా ఉన్నాయి మహా నగరంలోమహా నరకాన్ని తలపించే విధంగా ఉన్నాయి. రోడ్లు ఎలా ఉండాలి ట్రాఫిక్ సమస్యలకు తావివ్వకుండా ఉండాలి. అంటే ఎక్కడికక్కడ సిగ్నల్ పాయింట్ లు ఉండాలి. అవి సక్రమంగా పనిచేస్తూ ఉండాలి. మరి! రోడ్లు ఎలా ఉన్నాయి. మన ఆంధ్రా రోడ్లు, తెలంగాణ రోడ్లు అనే కాదు ముంబై రోడ్లు కూడా ఏమీ బాలేవు అని తేల్చేస్తూ ఓ మాజీ ముఖ్యమంత్రి భార్య కోపం అవుతున్నారు.
ట్రాఫిక్ కారణంగా చాలామంది జీవితాలు ఇక్కట్లలో పడిపోతున్నాయి. ముఖ్యంగా ముంబై దారులు అస్తవ్యస్తంగా ఉన్నకారణంగా చాలా జంటలు ఆఖరికి విడిపోయేందుకు కూడా సిద్ధం అవుతున్నాయి. ఎవరు ఔనన్నా కాదన్నా ఇదే నిజం అని అంటున్నారు మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ జీవన సహచరి అమృతా ఫడ్నవీస్. వినేందుకు కాస్త నవ్వు పుట్టించే విధంగా ఉన్నా ఇదే నిజం అని ఆమె పదే పదే నొక్కి వక్కాణిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే పునరుద్ఘాటిస్తున్నారు.
రోడ్లు బాగు చేయకుంటే సంసారాలు నిలబడవు అని ఓ మేలిరకపు మాట చెబుతున్నారు. దీంతో శివసేన (రూలింగ్ గవర్నమెంట్) ఇరకాటంలో పడింది. ముంబై దారులు అస్తవ్యస్తంగా ఉన్నాయని, ప్రజలు గంటల తరబడి ట్రాఫిక్ లో ఇరుక్కుపోతున్నారని పేర్కొంటూ ఆమె కాస్త అసహనం వ్యక్తం చేశారు.