హేమామాలినిపై కామెంట్స్.. రణదీప్ సూర్జేవాలాపై ఈసీ నిషేధం

-

బీజేపీ ఎంపీ హేమ మాలినిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో కాంగ్రెస్‌ నేత రణ్‌దీప్‌ సూర్జేవాలాపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలకు ఉపక్రమించింది. మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి 48 గంటల పాటు ప్రచారం చేయకుండా ఆయనపై నిషేధాన్ని విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ లోక్‌సభ ఎన్నికల ప్రక్రియలో ఈసీ విధించిన మొదటి ప్రచార నిషేధం ఇదే. హర్యానాలో ఎన్నికల ప్రచారం చేస్తూ హేమమాలినిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినందుకు గత మంగళవారమే సూర్జేవాలాకు ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసు జారీ చేసింది.

దీనికి బదులిస్తూ సూర్జేవాలా సమర్పించిన ప్రత్యుత్తరాన్ని నిశితంగా పరిశీలించిన ఈసీ, ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. హేమమాలినిపై సూర్జేవాలా అత్యంత అసభ్యకర, అనాగరిక వ్యాఖ్యలు చేశారని, అలాంటి మాటలు ఎన్నికల కోడ్‌కు వ్యతిరేకం అని ఈసీ వ్యాఖ్యానించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం, సూర్జేవాలా 48 గంటల పాటు ఎన్నికల ప్రచారం చేయకుండా బ్యాన్ విధిస్తూ ఆదేశించింది. నిషేధం అమల్లో ఉండే వ్యవధిలో బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్ షోలు, ఇంటర్వ్యూలు, మీడియా వేదికల్లో సూర్జేవాలా ప్రసంగాలు చేయకూడదని స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news