దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే పలువురిని అరెస్టు చేసి విచారణ చేస్తున్న అధికారులు విచారణలో వెలుగులోకి వస్తున్న విషయాలతో మరి కొంతమందికి నోటీసులు ఇస్తున్నారు. తాజాగా ఈడీ అధికారులు ఇవాళ ఉదయం ఆమ్ ఆద్మీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఇంట్లో సోదాలు జరిపారు.
దిల్లీ ఎక్సైజ్ పాలసీ మనీలాండరింగ్ కేసులో భాగంగా సోదాలు చేస్తున్నట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. ఎంపీ నివాసంతో పాటు ఆయనతో దగ్గరి సంబంధాలున్న స్టాఫ్ మెంబర్లను కూడా ఈ కేసు విషయంలో ఈడీ ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.
మరోవైపు, ఎంపీ నివాసంలో సోదాలు జరుగుతున్న తరుణంలో సంజయ్ సింగ్ తండ్రి మీడియాతో మాట్లాడారు.అధికారులు వారి పని వారు చేస్తున్నారని.. తాము పూర్తిగా వారితో సహకరిస్తున్నామని తెలిపారు. ఈ కేసులో క్లీన్చిట్ వచ్చేంతవరకూ ఎదురు చూస్తామని ఎంపీ తండ్రి పేర్కొన్నారు.
మరోవైపు.. ఈ కేసులో ఇప్పటికే శరత్ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారిన విషయం తెలిసిందే.
ఇక తాజాగా.. ఈ కేసులో అప్రూవర్లుగా మారేందుకు దినేష్ అరోరా, మాగుంట రాఘవకు రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో సౌత్‌గ్రూప్ నుంచి రూ.100 కోట్లను దిల్లీ ఆప్ నేతలకు అందించి దిల్లీ మద్యం విధానాన్ని తమకు అనుకూలంగా తయారు చేసుకున్నట్లు సీబీఐ, ఈడీలు ఇప్పటివరకు దాఖలు చేసిన ఛార్జిషీట్లలో పేర్కొన్నాయి.