రామసేతును జాతీయ వారసత్వ స్మారక చిహ్నంగా ప్రకటించాలని.. ఆ ప్రాంతంలో గోడ నిర్మించాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్పై విచారణ చేపట్టేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. రామసేతు ప్రాంతంలో గోడ నిర్మాణం చేపట్టేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హిందూ పర్సనల్ లా బోర్డు అధ్యక్షుడు అశోక్ పాండే దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టు కొట్టివేసింది.
ఇవి కేవలం పాలనాపరమైన అంశాలని పేర్కొంటూ పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఈ పిటిషన్‌ను జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుధాన్షు ధులియాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం పరిశీలించి.. గోడ నిర్మించాలని కోర్టు ఎలా ఆదేశిస్తుందని పేర్కొంది. ఇది పాలనాపరమైన వ్యవహారమని.. దీన్ని తామెందుకు చూడాలని వ్యాఖ్యానించింది.
రామసేతును జాతీయ వారసత్వ స్మారక చిహ్నంగా ప్రకటించేలా మార్గదర్శకాలు జారీ చేయాలని కోరుతూ కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి గతంలోనే సుప్రీంకోర్టులో ఓ పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.