నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ సోదాలు..

-

నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్​కు సంబంధించిన కేసులో ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ దిల్లీలో సోదాలు చేపట్టింది. సెంట్రల్ దిల్లీలో ఉన్న నేషనల్ హెరాల్డ్ ప్రధాన కార్యాలయం ‘హెరాల్డ్ హౌస్’ సహా సుమారు 12 ప్రాంతాల్లో దాడులు చేపట్టినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ కేసులో ఇటీవలే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఈడీ ప్రశ్నించిన నేపథ్యంలో.. తాజా సోదాలకు ప్రాధాన్యం ఏర్పడింది.

మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం సోదాలు జరుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. దర్యాప్తులో వెలుగు చూసిన నిధుల మళ్లింపు విషయమై మరింత సమాచారం సేకరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.

‘ఈ కేసులో ఇటీవల కొందరిని ప్రశ్నించిన తర్వాత లభించిన ఆధారాలను బట్టి తాజా చర్యలు చేపట్టాం. నేషనల్ హెరాల్డ్ లావాదేవీల్లో భాగమైన సంస్థలతో పాటు నిధుల మళ్లింపునకు సంబంధించిన అదనపు ఆధారాలను సేకరించేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని అధికారులు వెల్లడించారు.

కాంగ్రెస్‌కు నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక బకాయి ఉన్న రూ.90.25 కోట్లను వసూలు చేసుకునే హక్కును పొందేందుకు యంగ్‌ ఇండియన్ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ద్వారా నేరపూరితమైన కుట్ర పన్నారని సుబ్రహ్మణ్యస్వామి గతంలో ఆరోపించారు. ఇందుకు సంబంధించి సోనియా, రాహుల్‌ సహా ఏడుగురిపై దిల్లీలోని అడిషనల్‌ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో స్వామి కేసు దాఖలు చేశారు. కేవలం రూ.50 లక్షల చెల్లింపుతో ఆ హక్కును పొందేందుకు వారు యత్నించారని పిటిషన్‌లో ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news