మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో పలు రాష్ట్రాల్లో ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి. తాజాగా రాజస్థాన్‌లో ఈడీ సోదాలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ కుమారుడు వైభవ్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఫెమా నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించిన కేసులో వైభవ్‌కు ఈ సమన్లు జారీ చేసినట్లు సమాచారం. అక్టోబరు 27వ తేదీన విచారణకు హాజరు కావాలని పేర్కొన్నట్లు తెలిసింది.
మరోవైపు క్వశ్చన్ పేపర్ లీక్‌కు సంబంధించి మనీలాండరింగ్ కేసులోనూ ఈడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ సింగ్ డోటాస్రా, మహువా నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి నివాసాల్లో ఇవాళ సోదాలు నిర్వహించారు. సీకర్, జైపుర్‌లో గోవింద్ సింగ్‌కు చెందిన ఇళ్లు, కార్యాలయాలు, మహువా కాంగ్రెస్ అభ్యర్థి ఓం ప్రకాశ్ హుడ్లా నివాసంతో సహా పలు ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. మొత్తం ఏడు ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ సోదాలు చేపట్టినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. 200 అసెంబ్లీ నియోజకవర్గాలున్న రాజస్థాన్‌లో నవంబరు 25న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబరు 3న ఫలితాలను ప్రకటించనున్నారు.