ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసులో కెనడా-భారత్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే కెనడా దౌత్యవేత్తలను తిరిగి వెనక్కి తీసుకోమని భారత్ అల్టిమేటమ్ జారీ చేయగా.. ఆ దేశం తమ దౌత్యవేత్తలను ఇతర దేశాలకు పంపింది. ఈ నేపథ్యంలో కెనడాలో ఉంటున్న భారతీయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆ దేశంలో భారతీయ విద్యార్థులకు ఉద్యోగావకాశాలు దొరకకపోవడంతో వారు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు.
2022లో 2,26,450 మంది భారతీయ విద్యార్థులు ఉన్నత చదువుల కోసం కెనడాకు చేరుకోగా.. అక్కడ నెలకొన్న ఉద్యోగాల కొరతతో విద్యార్థులు సతమతమవుతున్నారు. చదువు పూర్తయ్యే సరికి తమకు ఉద్యోగం దొరుకుంతో లేదోనని ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగాలు లభించకపోవడంతో చదువు పూర్తైన విద్యార్థులంతా కెనడాలో క్యాబ్‌లు నడుపుతూ, దుకాణాలు, రెస్టారెంట్లలో పనిచేస్తూ తమ బిల్లులు కట్టుకుంటున్నారు. ముఖ్యంగా టొరంటో దాని చుట్టుపక్కల నగరాల్లో ఉండే విద్యార్థుల జీవితాలు మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మారాయి. అక్కడ అత్యధిక జీవన వ్యయ పరిస్థితులు ఉండటంతో.. ఎక్కువ మంది నెలవారీ ఇంటి అద్దెలు, ఇతర ఖర్చులు తగ్గించుకునేందుకు ఇరుకైన గదుల్లో కాలం గడుపుతున్నారు.