ఎన్‌సీపీ అధినేత అజిత్ పవార్‌కు షాక్ తగిలింది. మహారాష్ట్రలోని పింప్రి చించ్వాడ్ ప్రాంతానికి చెందిన నలుగురు కీలక నేతలు ఎన్‌సీపీకి రాజీనామా చేశారు. వీరంతా శరద్ పవార్ ఎన్‌సీపీలో చేరే అవకాశాలున్నట్లు సమాచారం. లోక్‌సభ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో అజిత్ పార్టీకి ఫలితాలు రాకపోవడంతో ఈ పరిణామం చోటుచేసుకున్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
గత ఏడాది అజిత్ పవార్ ఎన్‌సీపీని చీల్చి ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షంగా చేరి దాదాపు 40మంది ఎమ్మెల్యేలు, కొందరు ఎమ్మెల్సీలను తన వెంట తీసుకెళ్లారు. కానీ ఇప్పుడు లోక్సభ ఫలితాల తర్వాత సీన్ రివర్స్ అవుతున్నట్లు కనిపిస్తోంది. పింప్రి చించ్వాడ్ ప్రాంతానికి చెందిన కీలక నేతలు పార్టీని వీడారు. ఆ ప్రాంతంలో పార్టీ యూనిట్ చీఫ్ అజిత్ గవ్హనే కూడా వారిలో ఉన్నారు. మిగతా ముగ్గురు.. యశ్ సానె, రాహుల్ భోంస్లే, పంకజ్ భాలేకర్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. వారంతా శరద్ వర్గంలో చేరతారని ఊహాగానాలు. పార్టీని బలహీనపరచాలని చూసిన వారిని తమతో చేర్చుకోమని కొద్దిరోజుల క్రితం శరద్ పవార్ స్పష్టం చేశారు.