గో ఫస్ట్ విమానం అత్యవసర ల్యాండింగ్..

-

స్మోక్‌ వార్నింగ్ రావడంతో దేశీయ విమానయాన సంస్థ గో ఫస్ట్ విమానం అత్యవసరంగా ల్యాండ్ కావాల్సి వచ్చింది. బెంగళూరు నుంచి మాల్దీవుల్లోని మాలెకు బయలుదేరిన ఈ విమానం గగనతలంలో ఉండగా.. పైలట్ స్మోక్ వార్నింగ్‌ను గుర్తించాడు. దాంతో అప్రమత్తమైన సిబ్బంది తమిళనాడులోకి కోయంబత్తూర్‌లో అత్యవసరంగా విమానాన్ని దింపారు.

ఆ సమయంలో విమానంలో 92 మంది ప్రయాణికులున్నారు. అయితే అది తప్పుడు అలారం శబ్దమని(ఫాల్టీ స్మోక్‌ అలారం) ఎయిర్‌ పోర్టు అధికారులు వెల్లడించారు. అలారంలో సమస్య ఈ పరిస్థితికి దారితీసిందని, వెంటనే విమానం టేకాఫ్ అవుతుందని చెప్పినట్లు ఓ వార్తా సంస్థ పేర్కొంది.

గత కొన్ని రోజులుగా దేశీయ విమానాల్లో తరచూ సాంకేతిక లోపాలు, ఇతర సమస్యలు తలెత్తుతున్న విషయం తెలిసిందే. ఆ మధ్య వరుసగా స్పైస్‌జెట్‌, ఇండిగో విమానాలు ఈ సమస్యల కారణంగా దారిమళ్లడం, అత్యవసర ల్యాండింగ్‌ వంటివి చోటుచేసుకున్నాయి. గత నెల గో ఫస్ట్‌కు చెందిన విమానానికి కూడా తృటిలో పెను ప్రమాదం తప్పింది. గగనతలంలో ఉండగా విమానం విండ్‌షీల్డ్‌కు పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో విమానాన్ని దారిమళ్లించి అత్యవసరంగా దించేశారు. వరుసగా వెలుగుచూస్తోన్న ఈ సమస్యలపై గత నెల విమానయాన శాఖ మంత్రి జోతిరాదిత్య సింధియా సంస్థల అధిపతులతో సమావేశం నిర్వహించారు. భద్రతా పర్యవేక్షణను పెంచే అన్ని చర్యలను తీసుకోవాలని ఆదేశించారు.

ఈ క్రమంలోనే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. బేస్‌, ట్రాన్సిట్ స్టేషన్లలో నిపుణులు అనుమతించిన తర్వాతే విమానాలు బయటకు రావాలనే నిబంధనను తప్పనిసరి చేసింది. B1/B2 లైసెన్స్‌ ఉన్న నిపుణులైన ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటనెన్స్ ఇంజినీర్ నుంచి సరైన అనుమతి తర్వాతే బేస్‌, ట్రాన్సిట్ స్టేషన్లలో విమానాలను విడుదల చేయాలనే నిబంధనను తప్పనిసరి చేస్తున్నట్లు డీజీసీఏ వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news