చ‌రిత్ర‌లో సువర్ణాక్ష‌రాల‌తో లిఖించ‌ద‌గిన రోజు: ప‌్ర‌ధాని మోదీ

-

అయోధ్య‌లో రామ‌మందిర నిర్మాణానికి శంకుస్థాప‌న జ‌రిగిన రోజు చ‌రిత్ర‌లో సువర్ణాక్ష‌రాల‌తో లిఖించ‌ద‌గిన‌ద‌ని ప్ర‌ధాని మోదీ అన్నారు. బుధ‌వారం మోదీ అయోధ్య‌లో రామ మందిర నిర్మాణానికి వెండి ఇటుక‌తో శంకుస్థాప‌న చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న హ‌నుమాన్ గ‌ఢీ, రామ్‌లల్లా మందిరాల్లో ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. అనంత‌రం ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో మోదీ మాట్లాడుతూ.. భార‌త‌దేశ చ‌రిత్ర‌లోనే అద్భుత‌మైన ఘ‌ట్టం ఆవిష్కృత‌మైంద‌ని అన్నారు.

అయోధ్య రామ మందిర నిర్మాణ భూమి పూజ‌కు త‌న‌ను ఆహ్వానించినందుకు రామ‌జ‌న్మ‌భూమి తీర్థ క్షేత్ర ట్ర‌స్టుకు మోదీ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. నేడు యావ‌త్ దేశ‌మంతా రామ‌మ‌యంగా మారింద‌న్నారు. కాశ్మీర్ నుంచి క‌న్యాకుమారి వ‌ర‌కు, బెంగాల్ నుంచి గుజ‌రాత్ వ‌ర‌కు అంద‌రూ రామ‌నామాన్ని జ‌పిస్తున్నార‌న్నారు. రాముడంటే.. వంద‌ల కోట్ల మందికి విశ్వాస‌మ‌ని అన్నారు. విశ్వ‌మంతా జై శ్రీ‌రాం అని నిన‌దిస్తుంద‌న్నారు. ఈ సంద‌ర్భంగా మోదీ త‌న ప్ర‌సంగాన్ని సైతం జై శ్రీ‌రాం నినాదంతో ప్రారంభించారు.

అయోధ్య‌లో రామ‌మందిర నిర్మాణం ఎన్నో ఏళ్ల హిందువుల క‌ల అని మోదీ అన్నారు. నేడు రామ‌జ‌న్మ‌భూమికి ముక్తి ల‌భించింద‌న్నారు. అయోధ్య‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న భ‌క్తులు శ్రీ‌రామున్ని, జాన‌కీదేవిని ద‌ర్శించుకునేందుకు వ‌స్తార‌ని, అయోధ్య ప్ర‌పంచంలోనే గొప్ప న‌గ‌రంగా మారుతుంద‌న్నారు. కోటానుకోట్ల హిందువుల‌కు ఈ ఆల‌యం ఎంతో ముఖ్య‌మైంద‌ని మోదీ అన్నారు. అయోధ్య వ‌ల్ల భార‌త‌దేశ కీర్తి ప్ర‌తిష్ట‌లు మ‌రింత పెరుగుతాయ‌న్నారు. ద‌శాబ్దాల పాటు రామ్‌ల‌ల్లా ఆల‌యం టెంట్‌లోనే కొన‌సాగింద‌న్నారు. కానీ ఇక‌పై ఆల‌యంలో శ్రీ‌రాముడు పూజ‌లందుకుంటాడ‌‌ని అన్నారు.

రామ జ‌న్మ‌భూమి ఉద్య‌మంలో పాల్గొన్న‌వారంద‌రూ నేడు ఎంతో సంతోషంగా ఉన్నార‌ని ప్ర‌ధాని మోదీ అన్నారు. దేశ చ‌రిత్ర‌లో ఇదొక సువ‌ర్ణాధ్యాయ‌మ‌ని అన్నారు. వంద‌ల ఏళ్ల నిరీక్ష‌ణ నేడు ఫ‌లించింద‌న్నారు. దేశ ప్ర‌జ‌ల సంక‌ల్ప బ‌లంతోనే నేడు అయోధ్య‌లో రామాల‌య నిర్మాణం పూర్త‌వుతుంద‌ని అన్నారు. ఎంతో మంది త్యాగాల వ‌ల్ల నేడు అయోధ్య‌లో రామాల‌య నిర్మాణం జ‌రుగుతుంద‌న్నారు. రాముడు భార‌త‌దేశ ప్ర‌తిష్ట‌ను ఇనుమ‌డింప‌జేస్తాడ‌ని అన్నారు. ఇది ఒక మ‌హోత్స‌వ‌మ‌ని మోదీ అన్నారు.

రాళ్ల‌పై రామ‌నామం రాసి రామ‌సేతును నిర్మించార‌ని ప్ర‌ధాని మోదీ అన్నారు. దేశంలోని ప‌విత్ర స్థ‌లాల నుంచి మ‌ట్టి, న‌దుల నుంచి జ‌లాన్ని సేకరించి రామ మందిర నిర్మాణంలో ఉప‌యోగిస్తున్నార‌ని అన్నారు. న‌రుడిని నారాయ‌ణుడితో క‌లిపే ఉత్స‌వం ఇద‌ని అన్నారు. శ్రీ‌రాముడు ఓర్పులో భూదేవి లాంటివాడ‌ని, య‌శ‌స్సులో ఇంద్రుడు లాంటి వాడ‌ని కొనియాడారు. రామ మందిర నిర్మాణం కోసం ఎంతో మంది పోరాటాలు, బ‌లిదానాలు చేశార‌న్నారు. వారి త్యాగాల ఫ‌లితం వృథా కాలేద‌ని, నేడు అయోధ్య‌లో రామ మందిర నిర్మాణం జ‌రుగుతుంద‌ని అన్నారు.

శ్రీ‌రాముడు దేశ ప్ర‌జ‌లంద‌రికీ ప్రేర‌ణ‌గా నిలుస్తాడ‌ని ప్ర‌ధాని మోదీ అన్నారు. రామ మందిర నిర్మాణం కోసం త్యాగాల‌ను చేసిన వారంద‌రికీ న‌మ‌స్క‌రిస్తున్నామ‌ని అన్నారు. హ‌నుమంతుడి ఆశీస్సుల‌తో రామ మందిరాన్ని నిర్మిస్తున్నామ‌న్నారు. కోట్లాది మంది రామ‌భ‌క్తుల సంక‌ల్పం నేడు నెర‌వేరుతుంద‌న్నారు. శ్రీ‌రాముడికి సూర్యుడి అంత తేజస్సు ఉంద‌ని అన్నారు. దేశ‌వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కవులు రామాయ‌ణాన్ని భిన్నంగా ర‌చించార‌ని, రామాయ‌ణం ఒక్క‌టేన‌ని అన్నారు. రామ‌నామం ఏకైక‌మ‌ని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version