ఉత్తర్‌ప్రదేశ్‌లోని జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో హిందువులు పూజలు కొనసాగించవచ్చని అలహాదాబ్ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో వారణాసి జిల్లా న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అలహాబాద్ హైకోర్టు సమర్థించింది. జిల్లా కోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు ఎలాంటి కారణాలు లేవని తేల్చిచెప్పింది. ఈ ప్రార్థనా మందిరం సెల్లార్లో పూజలు చేసుకునేందుకు హిందువులను అనుమతించేలా దిగువ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది.
వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయ సమీపంలో ఉన్న జ్ఞానవాపి ప్రార్థనా మందిరం విషయంలో యాజమాన్య హక్కుల కోసం కొన్నేళ్లుగా వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. మసీదులోని వ్యాస్ తెహ్‌ఖానా అనే దక్షిణ నేలమాళిగలో హిందువులు పూజలు చేసుకోవచ్చని వారణాసి కోర్టు జనవరి 31వ తేదీన ఆదేశాలు జారీ చేయగా.. జిల్లా మెజిస్ట్రేట్‌ను వ్యాస్ తెహ్ఖానాకు పరిశీలకుడిగా నియమిస్తూ జనవరి 17న ఉత్తర్వులిచ్చింది.
ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేపట్టిన సర్వే నివేదిక ఆధారంగా అక్కడ హిందూ దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నట్లు వారణాసి కోర్టు నిర్ధరించింది. ఈ క్రమంలో ఆ రెండు ఉత్తర్వులను మసీదు కమిటీ హైకోర్టులో సవాల్ చేసింది. వ్యాజ్యంపై ఫిబ్రవరి 15న విచారణ జరిపిన హైకోర్టు.. తీర్పును రిజర్వ్ చేసి తాజాగా తీర్పు వెలువరించింది.