రెండు వర్గాల మధ్య ఘర్షణలు హర్యానాలో రణరంగం సృష్టించిన విషయం తెలిసిందే. నూహ్ జిల్లాలో కొద్దిరోజుల క్రితం చోటుచేసుకున్న అల్లర్లకు సంబంధించి పలువురు రోహింగ్యా వలసదారులను పోలీసులు అరెస్టు చేశారు. జులై 31న నూహ్‌లో ఓ మతపరమైన ఊరేగింపుపై రాళ్లదాడి ఘటనలో రోహింగ్యాలు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. తాము సేకరించిన ఆధారాల ద్వారా రాళ్లదాడి ఘటనలో పాల్గొన్నవారిని గుర్తించినట్లు తెలిపారు. వాటి ఆధారంగా నిందితులను అరెస్టు చేస్తున్నట్లు నూహ్ జిల్లా పోలీసు అధికారి నరేంద్ర బిజార్నియా వెల్లడించారు.
ప్రస్తుతం ఆ రాష్ట్రంలో పరిస్థితులు అదుపులో ఉండటంతో సోమవారం కూడా నాలుగు గంటలపాటు కర్ఫ్యూ సడలించినట్లు నూహ్ డిప్యూటీ కమిషనర్ ధీరేంద్ర ఖడ్‌గతా తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు బ్యాంకులు, ఏటీఎం సెంటర్లు మధ్యాహ్నం మూడు గంటల వరకు తెరిచి ఉంటాయని తెలిపారు. ఇప్పటిదాకా ఈ అల్లర్లకు సంబంధించి 56 ఎఫ్‌ఐఆర్‌లు నమోదుకాగా, 147 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.