‘నాలుగేళ్లుగా నిద్రపోయారా?’.. గుజరాత్‌ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

-

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ వీడియో గేమ్‌జోన్‌ అగ్ని ప్రమాద ఘటనలో 28 మంది అగ్నికి ఆహుతైన విషయం తెలిసిందే. పెను విషాదం నింపిన ఈ ఘటనలో చిన్నారులు కూడా ఉండటం మరింత కలచివేసింది. ఈ నేపథ్యంలో స్థానిక మునిసిపల్‌ అధికారుల తీరుపై ఆ రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అమాయకుల ప్రాణాలు కోల్పోయిన తర్వాత చర్యలు చేపడతామని చెబుతోన్న రాష్ట్ర యంత్రాంగంపై తమకు విశ్వాసం లేదని వ్యాఖ్యానించింది.

గేమ్ జోన్ అగ్నిప్రమాదం కేసుపై గుజరాత్‌ హైకోర్టు ఇవాళ  (మే 27వ తేదీ) విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా రాజ్‌కోట్ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (ఆర్‌ఎంసీ) అధికారులపై తీవ్ర స్థాయిలో మండిపడింది. ‘‘మీ పరిధిలో ఇంతటి భవనం ఉందని మీకు తెలియదా? కళ్లు మూసుకున్నారా? ఫైర్‌ సేఫ్టీ లేకుండా రెండున్నరేళ్లుగా ఇది ఉందని ఎలా చెబుతారు. టికెట్‌ వసూలు చేసేటప్పుడు వినోద పన్ను గురించి తెలియదా?’’ అని ప్రశ్నించింది.

పిటిషనర్‌ చేసిన విన్నపంపై ధర్మాసనం స్పందిస్తూ..‘‘ కఠిన చర్యలు ఎవరు తీసుకుంటారు? రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంపై మాకు నమ్మకం లేదు. మేం ఆదేశాలిచ్చిన నాలుగేళ్ల తర్వాత కూడా.. ఇలా జరగడం ఇది ఆరోసారి. ప్రాణాలు కోల్పోవడాన్నే వాళ్లు కోరుకుంటారు. ఆ తర్వాత యంత్రాంగాన్ని పురమాయిస్తారు. ఫైర్‌ సేఫ్టీకి సంబంధించి ఓ పిల్‌పై గతంలో ఇచ్చిన ఆదేశాలపై ఏం చేశారు. నెలలుగా కార్పొరేషన్‌ ఏం చేస్తోంది’ అని వ్యాఖ్యానించింది.

Read more RELATED
Recommended to you

Latest news