మహారాష్ట్ర ట్రెయినీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమె అడ్డదారుల్లో ఐఏఎస్ ఉద్యోగం పొందారంటూ పెద్దఎత్తున ఆరోపణలు రావడంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పూజా ఖేడ్కర్ శిక్షణను నిలిపివేయాలని ఆదేశించింది. తిరిగి ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌కు రావాలని పేర్కొంది. మహారాష్ట్రలోని జిల్లా శిక్షణా కార్యక్రమం నుంచి పూజా ఖేడ్కర్‌ని రిలీవ్ చేస్తున్నట్లు జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం ఓ ప్రకటనలో తెలిపింది.
పూజా ఖేడ్కర్ వ్యవహారశైలిపై ఆరోపణలు రావటం వల్ల పుణె నుంచి వాసిమ్కు బదిలీ చేసిన తర్వాత కూడా ఈ నిర్ణయం వెలువడం గమనార్హం. మరోవైపు పూజాఖేద్కర్ సమర్పించిన మెడికల్ సర్టిఫికెట్ల ప్రామాణికతపై పోలీసులు విచారణ చేపట్టనున్నారు. ఈ మేరకు దివ్యాంగుల శాఖ కమిషనర్- పుణె పోలీసులతోపాటు జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. సివిల్ సర్వీస్ పరీక్ష పాసయ్యేందుకు ఆమె నకిలీ దివ్యాంగురాలి సర్టిఫికెట్ సమర్పించడమే కాకుండా ఓబీసీ కోటా వాడుకున్నారని, పోస్టింగ్ సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని పూజ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.