డాక్ట‌ర్ల‌కు నిజం ఒప్పుకునే ధైర్య లేదు: ఐఎంఏపై ప‌తంజ‌లి సంస్థ విమ‌ర్శ‌లు

క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌ముఖ ఆయుర్వేద సంస్థ ప‌తంజ‌లి గతంలోనే క‌రోనిల్ ట్యాబ్లెట్ల‌ను ప్ర‌వేశ‌పెట్టిన సంగ‌తి తెలిసిందే. అయితే ప‌లు కార‌ణాల వ‌ల్ల అప్ప‌ట్లో ఆ ట్యాబ్లెట్ల విక్ర‌యాలు ఆగిపోయాయి. కానీ తాజాగా అన్ని ప‌రిశోధ‌న‌లు, రుజువుల‌తో ఆ సంస్థ ఆ ట్యాబ్లెట్ల‌ను మ‌ళ్లీ మార్కెట్‌లోకి విడుద‌ల చేసింది. అయితే ఆ ట్యాబ్లెట్ల‌కు అనుకూలంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ వ్యాఖ్య‌లు చేయ‌డం దుమారం రేపుతోంది.

ima has problem accepting the truth says patanjali

క‌రోనిల్ ట్యాబ్లెట్ల‌ను వాడాల‌ని ప‌రోక్షంగా అర్థం వ‌చ్చేలా ప‌తంజ‌లి సంస్థ‌కు అనుకూలంగా మంత్రి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ తాజాగా వ్యాఖ్య‌లు చేశారు. అయితే దానిపై ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్ తీవ్ర విమ‌ర్శ‌లు చేసింది. క‌రోనిల్ ట్యాబ్లెట్ల‌కు సంబంధించి ఎలాంటి ప‌రిశోధ‌న‌, ప‌త్రాలు లేకుండానే వాటిని మార్కెట్లో విక్ర‌యిస్తున్నార‌ని, వాటికి అనుకూలంగా కేంద్ర మంత్రి హ‌ర్ష వ‌ర్ధ‌న్ వ్యాఖ్య‌లు చేయ‌డం బాధాక‌ర‌మ‌ని ఐఎంఏ అధ్య‌క్షుడు డాక్ట‌ర్ జ‌య‌లాల్ అన్నారు.

అయితే డాక్ట‌ర్ జ‌య‌లాల్ వ్యాఖ్య‌ల‌ను ప‌తంజలి సంస్థ ఖండించింది. ఈ సంద‌ర్భంగా ప‌తంజ‌లి ఆయుర్వేద లిమిటెడ్ అధికార ప్ర‌తినిధి ఎస్‌కే తిజారావాలా మాట్లాడుతూ.. క‌రోనిల్ ట్యాబ్లెట్ల‌కు రుజువులు లేవ‌న‌డం అర్థ ర‌హిత‌మ‌న్నారు. పతంజ‌లి రీసెర్చి ఇనిస్టిట్యూట్‌లో రూ.500 కోట్ల పెట్టుబ‌డులు పెట్టామ‌ని, 300 మందికి పైగా సైంటిస్టులు అంకిత భావంతో ప‌నిచేస్తున్నార‌ని, రీసెర్చి లేకుండా తాము ఎలాంటి ఆయుర్వేద ఔష‌ధాన్ని విక్ర‌యించ‌బోమ‌ని స్ప‌ష్టం చేశారు. ఐఎంఏకు చెందిన డాక్ట‌ర్ల‌కు నిజం ఒప్పుకునే ధైర్యం లేద‌ని, అందుక‌నే ఇలాంటి ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని అన్నారు. ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ చేశారు. కాగా తిజారావాలా వ్యాఖ్య‌ల‌పై ఐఎంఏ స్పందించాల్సి ఉంది.