ఎమ్మెల్సీ ఎన్నికల ఎజెండా ఫిక్స్ చేసిన బీజేపీ,కాంగ్రెస్

-

ఎమ్మెల్సీ ఎన్నికల వేళ పట్టభద్రుల ఓట్ల కోసం పార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఉద్యోగాల భర్తీ పై రాజకీయ రగడ రాజుకుంది.అధికారంలోకి వచ్చిన తర్వాత లక్షా 32 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని టీఆర్ఎస్ చెబుతుంటే.. అంత సీన్ లేదంటూ సవాళ్లకు దిగుతున్నాయి విపక్షాలు. మంత్రి కేటీఆర్‌ ఉద్యోగాల భర్తీకి సంబంధించి లేఖ విడుదల చేయడంతో ఇంకాస్త స్పీడయ్యాయి విపక్ష పార్టీలు. గన్ పార్క్ లో చర్చకు రమ్మంటూ కాంగ్రెస్..ఓయూకి వస్తే లెక్కలు తేలతాయంటూ బీజేపీ సవాల్‌ విసురుతున్నాయ్‌.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిరుద్యోగ సమస్యనే విపక్షాలు ఆయుధంగా చేసుకుంటున్నాయ్‌. ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వడం లేదంటూ కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులు ఊరూరు చుట్టేస్తున్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాతే అత్యధికంగా నోటిఫికేషన్లు ఇచ్చామని.. ఉద్యోగాలనూ భర్తీ చేశామని టీఆర్ఎస్ చెబుతుంటే అసత్యాలతో నిరుద్యోగులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అవుతున్నాయి విపక్ష పార్టీలు.

అధికారంలోకి వస్తే లక్ష ఉద్యోగాలిస్తామన్న మాటను నిలబెట్టుకున్నామన్నారు కేటీఆర్‌. 2014 తర్వాత లక్షా 32 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పారు. దీనికి గట్టి కౌంటరే ఇచ్చాయి విపక్ష పార్టీలు. పదేళ్ల కాంగ్రెస్‌ హయాంలో ఎన్ని ఉద్యోగాలిచ్చామన్న లిస్ట్ మేం తీసుకొస్తాం మీరు ఇచ్చిన లక్ష ఉద్యోగాల లెక్క గన్ పార్క్ దగ్గరకు తీసుకురమ్మంటూ కేటీఆర్ కి సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఇవ్వబోయే 50 వేల ఉద్యోగాల నోటిఫికేషన్ పై కబుర్లు వద్దన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి . ప్రభుత్వం పై నిరుద్యోగుల్లో ఉన్న అసంతృప్తిని ఓటు బ్యాంక్ గా మలుచుకునేందుకు నిరుద్యోగ సమస్యనే ఎన్నికల అజెండా గా మార్చాయి బీజేపీ,కాంగ్రెస్ పార్టీలు.

గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓటు వేసేది విద్యావంతులు,టీచర్లు అందుకే వారికి అర్దమయ్యేలా నిరుద్యోగ సమస్యని ఎన్నికల ఎజెండాగా మార్చాయి విపక్ష పార్టీలు. ఎన్నికల వేళ ఈ సమస్య పైనే చర్చ జరుగుతుండటంతో దీనికి అధికార టీఆర్ఎస్ ఎలాంటి సమాధానం చెబుతుంది. విపక్షాల సవాల్ కి ప్రతిగా టీఆర్ఎస్ నేతలు ఏం సమాధానం ఇస్తారన్నది ఆసక్తి రేపుతుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news