భారత్‌తో పెట్టుకుని పెద్ద తప్పే చేసింది మాల్దీవుల ప్రభుత్వం.ఆ దేశం అధ్యక్షులు మహమ్మద్ ముయిజూ ప్రభుత్వానికి ఇప్పుడు అనేక సమస్యలు చుట్టుముడుతున్నాయి. ప్రభుత్వం ఏ క్షణమైనా పడిపోవచ్చు అనే సంకేతాలు కనిపిస్తున్నాయి.రాను రాను రాజకీయ పరిస్థితులు ఆ దేశంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా దిగజారుతున్నాయి. సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నామని అటు ప్రతిపక్షాలు రూడా అంటున్నాయి. సమయం వచ్చినప్పుడు మహ్మద్ ముయిజు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడతామన్నారు. వాస్తవానికి మహ్మద్ ముయిజ్జూ ప్రభుత్వంతో విభేదాల కారణంగా అధికార, ప్రతిపక్ష ఎంపీల మధ్య పార్లమెంట్‌లో ఇటీవల ముష్టియుద్ధం జరిగిన సంగతిని సోషల్ మీడియా ద్వారా ప్రపంచమే ప్రత్యక్షంగా చూసింది.
ఈ సంఘటన తరువాత పార్లమెంట్‌లో మహ్మద్ ముయిజు ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ప్రధాన ప్రతిపక్ష పార్టీ మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ మహమ్మద్ ముయిజుపై అభిశంసన తీర్మానం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పార్లమెంట్‌లో నెలకొన్న గందరగోళమే ఈ పరిస్థికి కారణం.డెమోక్రాట్‌లతో పాటు మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ అభిశంసన ప్రతిపాదనకు అవసరమైన మద్దతును పొందినట్లు సమాచారం.
ప్రతిపక్షాల ఐక్యత దృష్ట్యా, ఈ సంక్షోభాన్ని అధిగమించడం మహమ్మద్ ముయిజు ప్రభుత్వానికి అంత సులభం కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.భారత ప్రధాని నరేంద్ర మోదీకి క్షమాపణలు చెప్పాలని మాల్దీవుల ప్రతిపక్ష నేతలు ఇప్పుడు అధ్యక్షుడు మహ్మద్ ముయిజుపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. భారత్‌తో సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించాలని మాల్దీవుల జంహూరీ పార్టీ నాయకుడు కాసిం ఇబ్రహీం మహ్మద్ ముయిజుకు సూచించారు.
చైనా పర్యటన తర్వాత మహ్మద్ ముయిజు చేసిన వ్యాఖ్యలపై భారతదేశ ప్రజలకు, ప్రధాని మోదీకి క్షమాపణలు చెప్పాలని, లేదంటే ఇది మాల్దీవులకు హాని కలిగిస్తుందని ప్రతిపక్షాలు ప్రస్తుత అధ్యక్షుడికి సూచించారు. మాల్దీవులలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే, చైనా అనుకూల మహ్మద్ ముయిజూ భారతదేశంతో తన సంబంధాల పట్ల కఠినమైన వైఖరిని ప్రదర్శించడం ప్రారంభించాడు. ఇందులో భాగంగా తమ దేశం నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని భారతదేశాన్ని కోరాడు.
దీని తర్వాత, ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటన తర్వాత, మాల్దీవులతో పోల్చడంతో మహమ్మద్ ముయిజు మంత్రుల అనుచిత వ్యాఖ్యలు మరింత ఉద్రిక్తతను పెంచాయి. దీంతో భారతీయులు మాల్దీవుల పర్యటన రద్దు చేసుకోవడంతో ఆర్థికంగా భారీగా నష్టపోవాల్సి వచ్చింది.ఇంకా ఆలస్యం చేస్తే మరింతగా నష్టాలను ఎదుర్కోవలసి వస్తుందని అక్కడి ప్రతిపక్షాలు అధ్యక్షుడికి సూచిస్తున్నాయి. అయితే చైనాతో చేసుకున్న పలు ఒప్పందాల నేపథ్యంలో మహ్మద్ ముయిజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.