ఢిల్లీతోపాటు మరో 13 రాష్ట్రాల పాఠశాలలపై కరోనా ఎఫెక్ట్

‌రోజురోజుకు కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తోంది. ఆస్పత్రుల్లో కరోనా పాజిటివ్‌ల సంఖ్య కూడా పెరిగిపోతుంది. దేశంలో వ్యాక్సిన అందుబాటులోకి వచ్చినా, మాస్క్, సామాజిక దూరం వంటి నిబంధనలు కచ్చితంగా పాటించాలి. అదేవిధంగా సామాన్య ప్రజల జీవితంపై కరోనా ప్రభావం చూపుతోంది. పిల్లలు పాఠశాలలకు వెళ్లని పరిస్థితి కూడా ఏర్పడింది. సెకండ్‌ వేవ్‌ కరోనా పంజా నేపథ్యంలో మరోసారి స్కూళ్లకు తాళాలు పడ్డాయి. మరోవైపు బోర్డ్‌ ఎక్జామ్‌ పరీక్షలు రానున్నాయి. కేంద్ర పాలిత ప్రాంతమైన ఢిల్లీతోపాటు మరో 13 రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్‌ ఇనిస్టిట్యూట్‌లను మూసివేశారు. ఒకటవ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో ఏప్రిల్‌ 30 వరకు మూసివేశారు.


పాఠశాలలు మూసివేసినా, బోర్డ్‌ ఎగ్జామ్‌ అనుకున్న సమయానికి నిర్వహించనున్నారు.
ప్రభుత్వ తదుపరి ఉత్తర్వుల వరకు ఈ రాష్ట్రల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను మూసివేశారు. అలాగే హిమాచల్‌ ప్రదేశ్‌లో ఏప్రిల్‌ 21 వరకు సెలవు ప్రకటించారు.

మధ్యప్రదేశ్‌లో పరీక్షలు వాయిదా

ఏప్రిల్‌ 15 వరకు అన్ని పాఠశాలలకు బంద్‌ ప్రకటించిన ప్రభుత్వం బోర్డు ఎగ్జామ్‌ను కూడా వాయిదా వేయాలని యోచిస్తోంది. తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, జమ్మూ రాష్ట్రాల్లో కూడా పాఠశాలలను మూసివేశారు. మార్చి 9 నుంచి టీఎన్‌ ప్రభుత్వం పాఠశాలలకు సెలవు ప్రకటించగా, మార్చి 22 నుంచి ఛత్తీస్‌గఢ్‌ మూసివేసింది. పాఠశాలలను ఏప్రిల్‌ 5 నుంచి బంద్‌ చేసిన జమ్మూ ప్రభుత్వం పది, 12 తరగతి పరీక్షలను యథావిధిగా నిర్వహించనుంది.
పుదుచ్చేరిలో మార్చి 22 నుంచి 1–8 తరగతి, గుజరాత్‌ కూడా 1–9 వరకు బంద్‌ ప్రకటించింది.

బిహార్‌లో ఇదే పరిస్థితి

సెకండ్‌ వేవ్‌ కరోనా నేపథ్యంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను బిహార్‌ ప్రభుత్వం ఏప్రిల్‌ 18 వరకు బంద్‌ ప్రకటించింది. మిజోరంలో కూడా పాఠశాలలను మూసివేశారు. కానీ, ప్రైమరీ నుంచి 12 వ తరగతి వరకు పాఠశాలలను మళ్లీ తెరిచే దిశగా ఏప్రిల్‌ 9న ఆర్డర్‌ పాస్‌ చేసింది. రాజస్థాన్‌లో ఈనెల 19 వరకు హరియాణలో కూడా ఏప్రిల్‌ 30 వరకు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.