కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా.. మార్చి 31న ఇండియా కూటమి మహార్యాలీ

-

దిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో మనీలాండరింగ్ కేసుకు సంబంధించి దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్ను ఈడీ అధికారులు అరెస్టు చేసి కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. కేజ్రీవాల్ అరెస్టును ఆప్తో పాటు విపక్షాలు తీవ్రంగా ఖండించాయి. ఈ నేపథ్యంలో ఆయన అరెస్టును నిరసిస్తూ విపక్ష కూటమి ఇండియా మెగా మార్చ్‌కు రెడీ అయింది. మార్చి 31వ తేదీన దిల్లీలోని రాంలీలా మైదానంలో మహా ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపింది. విపక్ష కూటమిలోని కాంగ్రెస్‌, ఆమ్‌ఆద్మీ దిల్లీలో సంయుక్తంగా ఈ విషయాన్ని వెల్లడించాయి.

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌కు మార్చి 28వ తేదీ వరకు న్యాయస్థానం కస్టడీ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలో జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా ఇండియా కూటమి ఈ మహార్యాలీ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ ర్యాలీలో ఇండియా కూటమి అగ్రనేతలు పాల్గొంటారని ఆప్‌ దిల్లీ కన్వీనర్‌ గోపాల్‌ రాయ్‌ . తెలిపారు. మార్చి 31వ తేదీన నిర్వహించే మహా ర్యాలీ రాజకీయ ప్రయోజనాలకోసం కాదని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకని దిల్లీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అరవింద్‌ సింగ్‌ లవ్లీ పేర్కొన్నారు. సీఎంలను అరెస్టు చేయడం, రాజకీయ పార్టీల ఖాతాలను నిలిపివేయడం ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version