దేశవ్యాప్తంగా హోలీ సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. చిన్నాపెద్దా కలిసి హోలీ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. రంగులు చల్లుకుంటూ కోలాహలంగా సందడి చేస్తున్నారు. మరోవైపు ఈ పండుగను పురస్కరించుకుని కొంత మంది తెల్లవారుజామునే ఆలయాలకు పోటెత్తుతున్నారు. పండుగ సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే మహారాష్ట్రలోని పుణె నగరంలో వెలసిన ప్రసిద్ధ దగడూశేఠ్ వినాయక ఆలయాన్ని హోలీ పండుగ సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించారు.
దాదాపు 2 వేల కిలోల ద్రాక్ష పండ్లతో ఈ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఆలయ ప్రాంగణాన్ని నలుపు, ఆకుపచ్చని ద్రాక్షలతో ఆదివారం రోజున అందంగా తీర్చిదిద్దారు. సంకటహర చతుర్థి రోజున ఇక్కడ ప్రతి ఏటా ద్రాక్ష మహోత్సవ్‌ను జరుపుతారు. ఈ నేపథ్యంలోనే ‘సహ్యాద్రి ఫామ్స్’ ఆధ్వర్యంలో ఆలయాన్ని ద్రాక్షలతో అలంకరించగా.. చూసేందుకు పెద్దసంఖ్యలో భక్తజనం తరలివచ్చారు. స్వామివారి వద్ద ఉంచిన ద్రాక్ష పండ్లను ససూన్ ఆస్పత్రి, పితాశ్రీ వృద్ధాశ్రమంతోపాటు పలు సంస్థలకు పంపిణీ చేసినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.