సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమే గెలుస్తుందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ధీమా వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా ఐదు విడతల పోలింగ్ ముగిసే నాటికి విపక్ష కూటమి బలంగా పుంజుకొందని తెలిపారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, రాజ్యాంగానికి ముప్పు, ప్రజాస్వామ్యంపై దాడి వంటివే ప్రధాన అంశాలుగా ఎన్నికలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ఓ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖర్గే మాట్లాడుతూ.. 2019 ఎన్నికలతో పోలిస్తే 2024లో తాము ప్రతి రాష్ట్రంలో బాగా మెరుగుపడినట్లు తెలిపారు.
“బీజేపీ ప్రభుత్వంతో పోరాడేందుకు ప్రజలే స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. మేము వారికి సాయం చేస్తున్నాము. ఇక బిహార్‌లో కాంగ్రెస్-ఆర్జేడీ కలిసి బీజేపీ భావజాలంపై పోరాడుతున్నాయి. దళిత, వెనుకబడిన వర్గాలు బలంగా తమ కూటమికి మద్దతు పలుకతున్నాయి. యూపీలో 2019లో ఎస్పీ, కాంగ్రెస్ వేర్వేరుగా పోటీ చేయడంతో నాడు బలహీనపడ్డాయి. ఈ సారి ఇరు పార్టీల నేతలు కలిసి ప్రచారం చేయడం కూడా కూటమికి కలిసొచ్చే అంశం. రాజస్థాన్, మధ్య ప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో పార్టీ గతం కంటే ఎక్కువ సీట్లను సాధిస్తోంది. మహారాష్ట్రలో ఎంఏవీ అలయన్స్ మంచి సంఖ్యలో స్థానాలను సాధిస్తుంది.” అని ఖర్గే ఆశాభావం వ్యక్తం చేశారు.