భారత్ తనకు చాలా గొప్పగా స్వాగతం పలికారని.. తన హృదయంలో ఈ దేశానికి చాలా ప్రాధాన్యత ఉందని మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా తెలిపారు. మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ ఏర్పాట్ల పై నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. భారత సంస్కృతి, కళలు చాలా గొప్పగా ఉన్నాయని చెప్పారు. ఇక్కడ స్పూర్తి లభిస్తోందని.. విలువలు బోధిస్తారని చెప్పారు. భిన్నత్వంలో ఏకత్వం ఎంతో గొప్ప భావన అని పేర్కొన్నారు. ఎన్నో భాషలు ఉన్నా అంతా ఒక్కటిగా ఉండటం భారత్ స్పూర్తి. మిస్ వరల్డ్ కూడా భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని క్రిస్టినా పిస్కోవా పేర్కొన్నారు.
72వ మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ వేదిక కానుంది. మే నెలలో హైదరాబాద్ లో పోటీలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ త్రిలింగ దేశంగా ప్రాముఖ్యత కలిగిందని.. ఈ ప్రాంతానికి 2,500 ఏళ్ల చరిత్ర ఉందని పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన 11 ఏళ్లలో ఎంతో వృద్ధి సాధించామని చెప్పారు. రామప్ప, వేయి స్థంబాల గుడి, చార్మినార్, గోల్కొండ కోట లాంటి ఎన్నో గొప్ప కట్టడాలు ఇక్కడ ఉన్నాయని వివరించారు.