భారతదేశంలో కరోనా వైరస్ రికార్డుల మోత మోగిస్తోంది. కేవలం 24 గంటల్లోనే 97,859 పాజిటివ్ కేసులను నమోదు చేసింది, దీంతో దేశం 5.1 మిలియన్ల మార్కును అధిగమించింది. ఒక్కరోజులో 1,139మంది మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 83,230కు చేరుకుంది. ఇక్కడ మరొక విషయం ఏమిటంటే.. గత ఏడు రోజుల్లోనే భారతదేశంలో 652,355 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. ఇక దేశ వ్యాప్తంగా మహారాష్ట్ర (1,121,221), ఆంధ్రప్రదేశ్ (592,760), తమిళనాడు (519,860), కర్ణాటక (485,000), ఉత్తరప్రదేశ్ (330,000) అత్యధికంగా కేసులు నమోదు అయ్యాయి. అలాగే.. దేశ రాజధాని ఢిల్లీలో నిన్న అత్యధికంగా 4,473 కొవిడ్ కేసులు నమోదుకాగా, మొత్తం కేసుల సంఖ్య 230,000కు చేరింది.
మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌లో వరుసగా 23,365, 4,123 కేసులు నమోదయ్యాయి. దీంతో పశ్చిమ బెంగాల్‌లో సంఖ్య 212,383 కు పెరిగింది. కాగా, కేసుల సంఖ్య ఇలాగే పెరుగుతూ పోతే.. అతిత్వరలోనే భారత్ అమెరికా(6.8మిలియన్ల కేసులు)ను దాటేస్తుందనే చెప్పొచ్చు. ఇక ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య 30,024,106కు చేరుకుంది. ఇప్పటివరకు 21,776,977 మంది కోలుకోగా, 944,643 మంది మరణించారు. అమెరికాలో 6,826,800 కేసులు, బ్రెజిల్ (4,421,686), రష్యా (1,079,519 ) కేసులు ఉన్నాయి .