ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో ఇజ్రాయెల్-పాలస్తీనాపై జరిగిన సమావేశంలో పాకిస్థాన్ మరోసారి తన దుర్బుద్ధి బయటపెట్టింది. ఇజ్రాయెల్-పాలస్తీనా అంశంపై చర్చించేందుకు ఏర్పాటైన భేటీలో పాక్ .. కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించటాన్ని భారత్ గట్టిగా తిప్పికొట్టింది. పాకిస్థాన్ చర్యను ధిక్కారంగా భావిస్తున్నట్లు తెలిపింది. దాయాది దేశం ప్రతిస్పందన గౌరవప్రదంగా లేదని పేర్కొంది.
మధ్యప్రాచ్యంపై జరిగిన సమావేశంలో ఐరాసలో పాకిస్థాన్ దూత మునీర్ అక్రం.. కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించటంతో ఐరాసలో భారత్‌కు చెందిన డిప్యూటీ శాశ్వత ప్రతినిధి రవీంద్ర గట్టిగా బదులిచ్చారు. పాకిస్థాన్ పేరు ఎత్తకుండా తమ దేశ భూ భాగాల గురించి ప్రస్తావించటం ఓ దేశ ప్రతినిధి బృందానికి అలవాటుగా మారిందని చురకలు వేశారు. కశ్మీర్ తమ దేశంలో అంతర్భాగమే కాకుండా వీడదీయరాని భాగమని స్పష్టం చేశారు. పాకిస్థాన్ వ్యాఖ్యలను ధిక్కారంగా పరిగణిస్తామని, వారి మాటలు సమయానుకూలంగా లేవన్నారు.
అంతకుముందు ఐరాసలో అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ మాట్లాడారు. పాక్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు సాగించే లష్కర్-ఏ-తొయిబా లేదా హమాస్ ముంబయి లేదా కిబ్బర్జ్ బీరిలోని సామాన్య ప్రజలను లక్ష్యం చేసుకుంటే అవి చట్ట వ్యతిరేకమే కాకుండా సమర్థనీయం కావని తేల్చి చెప్పారు.